హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): కోవిడ్ నియంత్రణలో భాగంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ టీకా ఇచ్చే మహత్తర కార్యక్రమానికి సోమవారం మెడికవర్ హాస్పిటల్స్ శ్రీకారం చుట్టింది. 60 సంవత్సరాలు మొదలుకొని 100 సంవత్సరాలు వయసు కలిగినవారు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
100 సంవత్సరాల వ్యక్తి కూడా కోవిడ్ డోసు తీసుకోవడానికి ముందుకు రావడం విశేషం. హైదరాబాద్ నివాసి, మాజీ పారిశ్రామికవేత్త, ఫ్రీడమ్ ఆయిల్స్ సంస్థ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి తండ్రి జైదేవ్ చౌదరి సెక్రటేరియట్ దగ్గర మెడికవర్ హాస్పిటల్ లో కోవిడ్ టీకాను తీసుకున్నారు. ఈయన వయస్సు 100 ఏళ్లు.
కోవిడ్ టీకా తీసుకొని నాణ్యమైన జీవితాన్ని ఆనందించడానికి తాను ఎన్నో రోజులుగా ఎదుచూస్తున్నానని, టీకా తీసుకోవడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు. కోవిడ్ టీకా తీసుకుంటే ఆరోగ్యపరమైన అనర్థాలు ఉంటాయనే తప్పుడు ప్రచారం బయట ఉందనీ, అవన్నీ వట్టి వదంతులే తప్ప నిజాలు కావని ఆయన అన్నారు. అనంతరం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ మనకోసం, మన కుటుంబం కోసమే కాకుండా సామాజిక స్పృహ దృష్ట్యా కోవిడ్ టీకాను తీసుకోవడం శ్రేయస్కరం అన్నారు.