గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): నిరుద్యోగ యువతకు చేయుతనిచ్చేందుకు జాబ్ మేళాని నిర్వహించడం గొప్ప విషయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల రవీందర్ రెడ్డి గార్డెన్ లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించుకున్న యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ వేళ ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి, నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.


ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే కేవలం ఒక్కడి కడుపు మాత్రమే నిండుతుందని, ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ కుటుంబం మొత్తానికి కడుపు నిండుతున్నదన్నారు. మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హోప్ ఫౌండేషన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేవలం జాబ్ మేళా తోనే ఆగకుండా నిరుద్యోగ యువత కోసం ఆన్‌లైన్ కోచింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ లో శిక్షణ అందించి మరీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, హోప్ ఫౌండషన్ సభ్యులు ప్రవీణ్ రెడ్డి, బబ్లూ, మున్నా పాల్గొన్నారు.





