మియాపూర్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా

  • రూ. 600 కోట్ల విలువైన 5 ఎక‌రాల భూమికి ఫెన్సింగ్‌

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మియాపూర్ విలేజ్ మ‌క్తామ‌హ‌బూబ్ పేట‌లో 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా సోమ‌వారం కాపాడింది. 5 ఎక‌రాల మేర ఉన్న మ‌క్తామ‌హ‌బూబ్ కుంట‌ను క‌బ్జా చేసేయాల‌నే ప్ర‌య‌త్నాల‌ను కూడా అడ్డుకుంది. ఇక్క‌డ క‌బ్జాల చెర నుంచి కాపాడిన 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి విలువ రూ. 600 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. మియాపూర్ – బాచుప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారికి స‌మాంత‌రంగా ఉన్న చెరువు క‌ట్ట‌పై 200ల మీట‌ర్ల మేర వేసిన 18 షెట‌ర్ల‌ను తొల‌గించింది. దుకాణాల వెనుక వైపు ప్రైవేటు బ‌స్సుల పార్కింగ్ ఉంచిన స్థ‌లాన్నికూడా హైడ్రా ఖాళీ చేయించింది. మియాపూర్ స‌ర్వే నంబ‌ర్ 39లో మ‌క్తామ‌హ‌బూబ్‌పేట చెరువు క‌ట్ట క‌బ్జాతో పాటు.. గ‌తంలో మైనింగ్‌కు ఇచ్చిన స‌ర్వేనంబ‌రు 44/5 లో ఉన్న 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురౌతున్న‌ట్టు స్థానికుల నుంచి హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదు అందింది. ఒక్కో షెట్ట‌ర్‌(దుకాణం) నుంచి నెల‌కు రూ. 50 వేల చొప్పున రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తున్న‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అక్క‌డ ప్రైవేటు బ‌స్సుల పార్కింగ్‌కు స్థ‌లాన్ని ఇచ్చి నెల‌కు రూ. 8 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తున్నారు. ప్ర‌జావాణికి వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాలతో హైడ్రా క్షేత్ర‌స్థాయిలో సంబంధిత అధికారుల‌తో ప‌రిశీలించింది.

బ‌డాబాబుల మ‌ద్ధ‌తుతో..

స‌ర్వే నంబ‌రు 44/5 కు బ‌దులు 44/4 నంబ‌రును సృష్టించి 5 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసిన‌ట్టు హైడ్రా విచార‌ణ‌లో తేలింది. కారు వాషింగ్ సెంట‌ర్ ఏర్పాటు చేసుకుని మొత్తం ఈ భూమిని క‌బ్జా చేసిన‌ట్టు వెల్ల‌డైంది. మైనింగ్‌కు ఇచ్చిన భూమి గ‌డువు పెంచాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకోగా ప్ర‌భుత్వం నిరాక‌రించింది. మైనింగ్‌కు ఇచ్చిన భూమిలోనే త‌ప్పుడు స‌ర్వే నంబ‌రు(44/4)తో ఈ క‌బ్జాల‌కు పాల్ప‌డిన‌ట్టు వెల్ల‌డైంది. శేరిలింగంప్లి త‌హ‌సీల్దార్ గ‌తంలో 2013లో నోటీసు ఇచ్చి ఈ షెట్ట‌ర్ల‌ను తొల‌గించిన‌ట్టు కూడా తేలింది. క‌బ్జాల‌కు పాల్ప‌డిన కూన స‌త్యంగౌడ్‌, బండారి అశోక్ ముదిరాజ్‌ల వెనుక బ‌డాబాబులున్న‌ట్టు స‌మాచారం. వారు వెనుక ఉండి వీరితో క‌బ్జాల ప‌ర్వాన్ని న‌డుపుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ భూమి త‌మ‌ద‌ని చెబుతున్న వారి వ‌ద్ద ఎలాంటి ప‌త్రాలు లేక‌పోవ‌డ‌మే కాకుండా.. తాము వేరే వాళ్ల‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామ‌ని చెబుతున్నారు. వేరే వాళ్లు ఎవ‌ర‌నేది తేలాల్సి ఉంది. ఈ లోగా ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఈ భూమికి ఆనుకుని ఉన్న 5 ఎక‌రాల చెరువు క‌బ్జా ప్ర‌య‌త్నాల‌కు కూడా హైడ్రా చెక్ పెట్టింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here