నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీలు వెంకన్న, సుధాంష్, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మీ తో కలిసి మహిళ పొదుపు సంఘాల సభ్యులతో అవగహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ హరితహారంలో శేరిలింగంపల్లి నియోజవర్గాన్ని అగ్రగామిలో నిలబెట్టి ఆదర్శవంతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరు బాగస్వామ్యులు కావాలన్నారు. మహిళ పొదుపు సంఘాల సభ్యుల ద్వారా హరితహారాన్ని చేపట్టాలని, మహిళలు తమ పిల్లలను పెంచిన విధంగా మొక్కలను పెంచుతారనే ఉద్దేశ్యంతో భాగస్వాములుగా చేశామన్నారు.
ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరితహారంతో తెలంగాణలో అడవుల శాతం పెరిగిందన్నారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటిని కాపాడాలని సూచించారు. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, అన్ని రకాల అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, పూలు, పండ్ల మొక్కలు, పండుగలకు ఉపయోగపడే పత్రాలు ఇచ్చే మొక్కలను నాటి తప్పనిసరిగా సంరక్షించాలని అన్నారు. అదేవిధంగా పర్యావరణ హితం మట్టి గణపతులను పూజించాలని, ఈ విషయంలో మహిళలు ముందుండాలని, ప్రతి ఒక్కరికి అవగహన కల్పించాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగహన కల్పించారు. మన ఇంటి పరిసరాలను, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన , యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు మన్వి, ఉషారాణి, ఎంఎంఓహెచ్ నగేష్ నాయక్, యూబీడీ మేనేజర్లు యూసఫ్, చంద్రకాంత్ రెడ్డి, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.