– కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా గ్రాడ్యుయేట్లందరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్న ఓటరు నమోదు ప్రక్రియను గురువారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు.
2017 సంవత్సరం కంటే ముందు ఏదైనా డిగ్రీ/డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఈ ఓటరు నమోదు చేసుకోవచ్చన్నారు. డిగ్రీ జిరాక్స్ మెమో గాని ప్రొవిజన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటరు కార్డు/పాన్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్ /కరెంట్ బిల్లు/ ఫోన్ బిల్లు తదితర అడ్రస్ ప్రూప్ తో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, సెల్ నంబర్, ఈ మెయిల్ తో ఫాం నం 18 దరఖాస్తు నింపి సంతకం తో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి గ్రాడ్యుయేట్ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు.
ఈ ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6 వ తేదీ వరకు 40 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. మొదటి రోజున చేపట్టిన ఓటరు నమోదులో చురుగ్గా పాల్గొంటున్నారని ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, నాయకులు భాగ్యలక్ష్మీ, జయమ్మ, కళ్యాణి, రోజా, భవాని, శ్వేత, యోగి, వెంకటేశ్వర్లు, హరి, మహేందర్, అలీం, మోజెస్, శాంతారావు తదితరులు పాల్గొన్నారు.