నమస్తే శేరిలింగంపల్లి: విద్య విజ్ఞానాన్ని అందించడంతో పాటు దేశసమగ్రతకు ప్రతి పౌరుడు అంకితభావంతో పనిచేయాలనే ఆలోచన కలిగించాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ శాఖాధిపతి ఆచార్య మధుసూదన్ జోషి పేర్కొన్నారు. గురువారం గోపనపల్లి లోని జవహర్ నవోదయ విద్యాలయం లో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విభాగ శాఖాధిపతి ఆచార్య మధుసూదన్ జోషి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఆచార్య జోషి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య ద్వారానే భారతదేశ అభివృద్ధి అని భావించిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. భారతదేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శి, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారని, తన కాలంలో ఆయన విద్యా సంస్థలకు విశేషమైన కృషి చేశారన్నారు. ఆజాద్ సమగ్ర విద్యా విధానాన్ని రూపకల్పన చేసి, బ్రిటిష్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కళలు సంగీత సాహిత్య వికాసానికి చేయూతనిచ్చి అకాడమీలు ఏర్పాటు చేశారన్నారు. 1948లో ప్రాథమిక ఉన్నత విద్యకు 1952లో సెకండరీ విద్య కు కమిషన్ ఏర్పాటు చేశారని, ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన ఐదు సంవత్సరాలలో UGC, iccr, AICTU, CINR, IIT ఖరగ్పూర్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఏర్పాటు చేసి భారతీయ విద్యా రంగాన్ని పరిపుష్టం చేసి విద్యావిధానంలో కొత్త పోకడలు సృష్టించి దేశాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడిగా విద్యాశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినాన్ని 2008 నుండి భారత ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఆయన బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, తొలి భారత ఉపరాష్ట్రపతి గా బాధ్యతలు నిర్వహించారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలని 14 సంవత్సరముల లోపు ఆడపిల్లలకు ఉచిత నిర్బంధ విద్య ఉండాలని కలలుగన్న గొప్ప స్టేట్స్ మాన్ అని కొనియాడారు. మనం సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ఆయనకు అసలైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఆర్. డానియల్ రత్న కుమార్ అధ్యక్షత వహించగా వైస్ ప్రిన్సిపాల్ ఎం ఎస్ మేత్రి, కోఆర్డినేటర్ తిలక్, ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, రామ్మోహన్, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.