నమస్తే శేరిలింగంపల్లి: ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని శనివారం మాదాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంచలగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ హాజరై మాట్లాడారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జన నష్టం, ఆస్థి నష్టం అభివృద్ధికి ఆటంకం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలో యుద్ధ నివారణ, శాంతి ని నెలకొల్పడానికై 1945 అక్టోబర్24 న ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో 50 దేశాలతో సభ్యత్వం ప్రారంభించి నేడు 193 దేశాలతో సభ్యత్వం కలిగి ఉందన్నారు. మరో రెండు దేశాలు వాటికన్ సిటీ, పాలస్తీనా దేశాల సభ్యత్వం కోసం పరిశీలనలో ఉంచారని తెలిపారు. ప్రపంచ దేశాల అన్నింటిలో విద్య, వైద్య, పర్యావరణం, సామాజిక న్యాయం వంటి విషయాలలో అన్ని దేశాలలో సమానంగా అభివృద్ధి జరగాలన్న సంకల్పంతో ఐక్యరాజ్య సమితి ఏర్పడిందని దీనిని 6 విభాగాలుగా ఏర్పాటు చేసుకుని సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, ఎకానమిక్ సోషల్ కౌన్సిల్, ట్రస్ట్ షిప్ కౌన్సిల్, కోర్ట్ ఆఫ్ జస్టిస్, సచివాలయం వంటి విభాగాలను ఏర్పాటు చేశారని అన్నారు.
సచివాలయానికి సెక్రటరీ జనరల్ 5సంవత్సరాల కాల పరిమితిని ఎన్నుకుంటారని, ఆయన నిర్వహణలో సమితి కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. యూఎన్ఓ లో ఐదు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాలు ఉన్నాయని తెలిపారు. రెండేళ్ల కాలపరిమితి తో 10 దేశాలు తాత్కాలిక సభ్యులుగా ఎన్నుకోబడ్డాయన్నారు. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని అక్టోబర్24 న ప్రపంచ ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. ప్రతి సంవత్సరం ఒక ఆశయంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ఈ సంవత్సరం ”సమానమైన, స్థిరమైన పరిస్థితి కోసం మెరుగ్గా కోలుకోవడం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు బసవలింగం, అసోసియేషన్ సభ్యులు ఫణి కుమార్, శివరామకృష్ణ, సురేందర్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు భారత వికాస్ పరిషత్ ఆర్యభట్ట శాఖ మాదాపూర్ వారు రిస్ట్ వాచీలు బహుకరించారు.