శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపును కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి రవికుమార్ యాదవ్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిందని అన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో పలు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదని, కొత్త అడ్మిషన్ల విషయంలోనూ ఇబ్బందులు కల్పిస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు వంటి హామీలు అమలు కాలేదని రవికుమార్ యాదవ్ విమర్శించారు. యూనివర్సిటీలు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు ఆహారం, భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సుమారు 150 ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో 2,000 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని, 40 మందికి పైగా మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన రవికుమార్ యాదవ్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





