శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): వరదలు, నీటిముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూగర్భ జలాల రీచార్జ్‌ను పెంచేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై దృష్టి సారించింది. ఈ అంశాలపై సీఎంసీ కమిషనర్ సృజన సమక్షంలో డా. భీమమ్రాజా, శక్తివేల్‌తో సమావేశం నిర్వహించి వివిధ సాంకేతిక పరిష్కారాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. 637.19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సీఎంసీ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా 56 ప్రాంతాల్లో సుమారు 1–2 గంటల పాటు నీటిముంపు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

వేగవంతమైన పట్టణీకరణతో పేవ్డ్ ప్రాంతాలు పెరగడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోయిందని అధికారులు గుర్తించారు. ఫలితంగా వర్షపు నీటి ప్రవాహం పెరగడం, నీటిముంపు సమస్యలు తలెత్తడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని సేకరించడం, నిల్వ చేయడం, భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం ద్వారా నీటిముంపును తగ్గించే ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై సీఎంసీ దృష్టి సారించింది. దేశంలోని పలు నగరాల్లో అమలవుతున్న విధానాలను ఈ సందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా తమిళనాడులోని కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేస్తున్న స్మార్ట్ అర్బన్ డీసెంట్రలైజ్డ్ స్టార్మ్ వాటర్ సొల్యూషన్స్, మాడ్యులర్ ఎకో బ్లాక్, స్పాంజ్ విధానాలపై ప్రజెంటేషన్‌లో వివరించారు. వర్షపు నీటి ప్రవాహాన్ని సమర్థవంతంగా సేకరించి భూగర్భ జలాల రీచార్జ్‌ను పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నీటిముంపును తగ్గించే విధానాలను ఇందులో వివరించారు.
ప్రజెంటేషన్ అనంతరం సైబరాబాద్‌లో నీటిముంపు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి పరిష్కారాలను దశలవారీగా అమలు చేసేందుకు సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి సమర్థవంతమైన నిర్వహణతో పాటు భూగర్భ జలాల రీచార్జ్‌ను ప్రోత్సహిస్తూ సుస్థిరమైన పట్టణ నీటి నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ చర్యలను చేపడుతున్నట్లు సీఎంసీ అధికారులు తెలిపారు.





