శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా, ఆయన ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి రక్తదానం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చేపట్టినట్లు గంగాధర్ రెడ్డి తెలిపారు. రక్తదానం–ప్రాణదానం.. సేవే మన సంకల్పం అనే సందేశంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బందులు పడుతున్న రోగులకు రక్తదానం ఎంతో విలువైన సహాయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకలకు పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించాలనే ఉద్దేశంతో రక్తదానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ గత 25 ఏళ్లుగా ప్రజా సేవకు అంకితమై దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా, గౌరవంగా ఉందన్నారు. ఒక యూనిట్ రక్తం కూడా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేకరించిన రక్తాన్ని అవసరమైన నిరుపేదలు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులకు ఉపయోగపడేలా స్థానిక బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు అందజేశారు.

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రక్తదాన శిబిరాలతో పాటు పలు సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు గంగాధర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆశీర్వాద దీపం కార్యక్రమం, విద్యార్థులకు చిత్రలేఖన, ఉపన్యాస పోటీలు, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి కార్యక్రమాలు, స్వచ్ఛత కార్యక్రమాలు, ఖాదీ–స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన, మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అక్టోబర్ 7న సేవా జ్యోతి కలశ యాత్ర, అక్టోబర్ 17న నెల రోజుల సేవా కార్యక్రమాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలు ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని గంగాధర్ రెడ్డి అన్నారు. యువత రక్తదానం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, పేదలకు సహాయం వంటి సామాజిక కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.





