శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కుట్టు నైపుణ్యంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు అడుగులు వేయించేలా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి కృషి చేసిన ఉప్పలపాటి శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని గాంధీ అన్నారు. మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తారని పేర్కొన్నారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని, భవిష్యత్‌లో వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కుట్టుతోపాటు డిజైనింగ్, ఆధునిక అల్లికలు తదితర అంశాల్లోనూ శిక్షణ తీసుకుని కాలానుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని గాంధీ తెలిపారు. హాస్టళ్లు, పాఠశాలల్లో దుస్తులు కుట్టే అవకాశాలు కల్పించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచుతామని చెప్పారు. ఇది నిరంతరం కొనసాగించే శిక్షణ కార్యక్రమమని, నడిగడ్డ తండాలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ శాఖల నుంచి దుస్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లు వచ్చినప్పుడు స్థానికంగా శిక్షణ పొందిన మహిళలకే అవకాశాలు దక్కేలా కృషి చేస్తానని గాంధీ హామీ ఇచ్చారు. మహిళా సాధికారత, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని గాంధీ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ మోహన్ నాయక్, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.





