శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మార్తాండ్ నగర్ అభివృద్ధికి గాంధీ విశేష కృషి చేశారని, కాలనీలో అనేక మౌలిక వసతులు కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మంచినీటి సరఫరాను మరింత మెరుగుపరచడంతో పాటు, అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులను పూర్తి చేయాలని కోరారు.

కాలనీ వాసుల వినతిపై గాంధీ స్పందిస్తూ.. మార్తాండ్ నగర్ కాలనీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కాలనీలో వరద నీటి కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో మంచినీటి పైప్‌లైన్ పనులను పునరుద్ధరించి, మెరుగైన నీటి సరఫరా వ్యవస్థను అందిస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. మార్తాండ్ నగర్‌తో పాటు కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ ముదిరాజు, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, భగత్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





