శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించి వాహనాలను నడపరాదని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ అన్నారు. గురువారం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద లింగంపల్లి వైపు వచ్చే వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్నారా, బస్సుల్లో డబుల్ డ్రైవర్లు ఉన్నారా, ప్రయాణికుల భద్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు తదితర అంశాలను ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.






