ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న విషయం విదితమే. ముందుగా 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, పోలీసులు, ఇతర అత్యవసర విభాగాలకు చెందిన వారికి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇస్తారు. అందులో భాగంగానే పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే విమానాల్లో కార్గో ద్వారా సరఫరా చేస్తున్నారు. అలాగే భారత్ బయోటెక్ నుంచి కూడా రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా జరుగుతోంది.
కాగా తెలంగాణకు కేంద్రం మొత్తం 3.72 లక్షల డోసులను ఇప్పటికే పంపించింది. ఈ క్రమంలో పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి హైదరాబాద్‌కు కోవిషీల్డ్ టీకాలు వచ్చాయి. మొత్తం 3 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల టీకాలను స్వీకరించారు. వీటిని కోఠిలోని ఇమ్యునైజేషన్ భవనానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపించడం మొదలు పెట్టారు. బుధవారం సాయంత్రం నుంచి వ్యాక్సిన్‌ను ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారు.
ములుగుకు 50 వయల్స్, 500 డోసులు, భూపాలపల్లికి 56 వయల్స్, 560 డోసులు, నారాయణపేటకు 114 వయల్స్, 1140 డోసుల వ్యాక్సిన్‌ను చివరిగా సరఫరా చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో 16వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1213 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారు.