బెల్లంపల్లి గురుకులంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలి: దుండ్ర కుమారస్వామి

శేరిలింగంప‌ల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ప్రముఖ న్యాయవాది, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొంటూ, బాధ్యులపై తక్షణ సస్పెన్షన్‌తోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి గురుకులంలో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి రావడం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని కుమారస్వామి విమర్శించారు.

విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, ఆహార నిల్వ విధానాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరించడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ కేవలం విచారణలకే పరిమితమై, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, సంబంధిత సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి, స్వతంత్రంగా ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రతి గురుకులంలో ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంతోపాటు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు.

గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రజల్లో ప్రభుత్వంపై అసహనాన్ని పెంచుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం చివరికి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల విద్యాసంస్థల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఆహార భద్రత, పరిశుభ్రత, తాగునీటి నాణ్యతపై సమగ్ర ఆడిట్ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here