శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవాల ఏర్పాట్లను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శేరిలింగంపల్లి, మియాపూర్, నార్సింగి సర్కిళ్ల పరిధిలో నిమజ్జనం జరిగే ప్రధాన చెరువులు, నిమజ్జన మార్గాలను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జోనల్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. పోలీస్, విద్యుత్, జలమండలి తదితర ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

చెరువుల పరిసరాలు, నిమజ్జన మార్గాల్లో 24 గంటల పాటు పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, రాత్రివేళల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చెరువులు, క్యూ లైన్ల వద్ద తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల కోసం తాగునీరు, మొబైల్ శౌచాలయాలు, వైద్య శిబిరాలు తదితర అవసరమైన పౌర వసతులను అందుబాటులో ఉంచాలని నారాయణ్ అమిత్ ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా సురక్షితమైన, స్వచ్ఛమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు జరిగేలా ఫీల్డ్ టీమ్స్ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తనిఖీల్లో ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, ఈఈలు, ఏఎంఓహెచ్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





