శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్‌లోని హఫీజ్ నగర్ వసంత్ సిటీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అన్నమాచార్య భావనా వాహిని శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. శిష్యులు సందీప్, శ్రేయ, సాయి గాయత్రి, తేజస్విని, రన్విత రెడ్డి, అక్షయ, అక్షయ్ సంయుక్తంగా గణపతి, అన్నమయ్య కీర్తనలను ఆలపించి భక్తులను అలరించారు. అన్నమ గాయత్రి, గణరాజ గుణరాజ, కొండలలో నెలకొన్న, సకల శాంతి, సామజవర గమనా, గుజ్జు రూపమున, నమో నమో గణనాధ, గోవిందాశ్రిత, గణపతి నీవే గతి తదితర కీర్తనలను గానం చేశారు.

అదివో అల్లదిహో, చిత్తము కొలది, వద్దే గొల్లెత, వేడుకుందామా, తందనాన అహి వంటి అన్నమయ్య కీర్తనలతోపాటు పలు భక్తిగీతాలను ఆలపించారు. తబలాపై సిద్ధు, కీబోర్డ్‌పై మనోహర్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానికి రమణ గోరంట్ల సారథ్యం వహించారు. భక్తి గీతాలు, కీర్తనలతో వసంత్ సిటీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు ఉత్సాహంగా భజన, కీర్తనల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.





