నమస్తే శేరిలింగంపల్లి: కరోనా రోగులకు కార్పొరేట్ హాస్పిటల్స్ అధిక బిల్లుల వసూళ్ల నుంచి ఉపశమనం కల్గించాలని కోరుతూ శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్, ఫ్లోర్‌లీడర్ రామస్వామియాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధిసోకి కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ వ్యాధి సోకిన వారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకక కార్పొరేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించవలసి వస్తున్నదని అన్నారు. కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారు రోగుల నుండి లక్షలాది రూపాయలను బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం రూపొందించిన రేట్ల కన్నా అధికంగా బిల్లులు వసూలు చేయడం వలన రోగుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్రక్క నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి సతమతమవుతున్నారని, అదేవిధంగా దురదృష్టవశాత్తు రోగి మృతిచెందిన యెడల దహన సంస్కారాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. దీంతో పేద, మధ్య తరగతి వాడి బతుకు సాగించటం కష్టతరం అవుతున్నదని, కరోనా వ్యాధి సోకి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జాయిన్ అయిన రోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పేదల పక్షపాతి, బంగారు తెలంగాణా రథసారథి ఐన తమరు కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండే విధంగా ప్రతి హాస్పిటల్స్‌కి ఒక ఐఎఎస్ లేదా ఐపీఎస్ అధికారిని పర్యవేక్షకులుగా నియమించాలని కోరారు. వారి సమక్షము లోనే రోగి బంధువులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన రేట్లకే బిల్లులు చెల్లింపు జరిగే విధంగా తగు ఆదేశాలు జారీచేసి, నిత్యం తమరు ఒక రెండు గంటల పాటు సమీక్షించిన యెడల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రిని లేఖలో కోరారు.