అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్రం భారీగా నిధులు : కైతాపురం జితేందర్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తోందని హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్–2026 లో భాగంగా, ప్రధాని మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని హఫీజ్‌పేట్ యూత్ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సేవలపై సిబ్బందితో చర్చించారు. అనంతరం అంగన్‌వాడీ సిబ్బంది, గర్భిణులను శాలువాలతో సత్కరించారు. చిన్నారులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బోయిని అనూష మహేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి మాణిక్ రావు మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ఐసీడీఎస్, అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మేరీ, శ్రీధర్ రావు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, బీజేపీ నాయకురాలు పావని కుమారి, నాయకులు నవీన్ కుమార్, మనోజ్ యాదవ్, హర్షిత్, రాజశేఖర్, లోకేష్‌తో పాటు ఐసీడీఎస్, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here