OC – JAC – EWC శేరిలింగంపల్లి అధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్ రావు

  • నియోజకవర్గంలోని అగ్రకుల నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కార్యాచరణ
  • ఫిబ్రవరి 23న‌ ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓసీ-జేఏసీ-ఈడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, శేరిలింగంపల్లి అధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్ రావు నియమితులయ్యారు. మదీనగూడ లోని ఆయ‌న‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓసి జేఏసీ జాతీయ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి వినోద్ రావుకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్ల సంజీవ రెడ్డి మాట్లాడుతూ అగ్రకులాల్లోని నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా ఓసీ జేఏసీ ఏర్పడిందని అన్నారు. ఇటీవల జరిగిన వరంగల్ సింహగర్జనను భారీ విజయవంతం చేసిన ఓసిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అగ్రకుల సంఘాల నాయకులందరూ ఏకమై ఓసీల్లోని నిరుపేదల హక్కులే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లిలోని అన్ని వర్గాల వారితో మంచి సత్సంబంధాలు కలిగిన వినోద్ రావుని ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ.. 1986 నుంచి తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశానని అన్నారు. హైదరాబాద్ కి వచ్చాక తన మిత్రుడు, ప్రస్తుత కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ద్వారా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కు దగ్గర అయ్యానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశానని తెలిపారు. 2002లో శేరిలింగంపల్లి సేవాదళ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ YSR పాదయాత్రలో కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో నాటి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రంగారెడ్డి జిల్లా సేవాదళ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారని, ఆ తర్వాత గ్రేటర్ సేవాదళ్ చైర్మన్ గా సేవలందించాన‌ని తెలిపారు. అదేవిధంగా మదీనగూడ గ్రామంలో హనుమాన్ దేవాలయం చైర్మన్ గా ఆలయ పునర్నిర్మాణం లో కీలక భూమిక పోషించానని అన్నారు. ఈ క్రమంలోనే త‌న‌ పనితీరును గుర్తించి ఓసీ జేఏసీ ఈడబ్ల్యూఎస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం త‌న‌ను రాష్ట్ర కమిటీ లో ఉపాధ్యక్షుడిగా తీసుకొని శేరిలింగంపల్లి అధ్యక్ష బాధ్యతలను అప్పగించింద‌ని అన్నారు.

త‌న‌పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నియోజకవర్గంలో ఉన్న ఓసి కులాల్లోని నిరుపేదల అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఓసీలలో 10% మాత్రమే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది ఉన్నారని మిగిలిన 90 శాతం మంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా అగ్రకులాల్లోని నిరుపేద విద్యార్థులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వైద్య ఆర్థిక సామాజిక రంగాలలో వెనుకబడిన ఓసి వర్గాల్లోని ప్రతి ఒక్కరిని కలుపుకొని వారి హక్కుల కోసం పోరాడేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓసి జెఎసి మహా ధర్నాను విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి అగ్రకుల నిరుపేదలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసి జెఎసి రాష్ట్ర కార్యదర్శులు కొడాలి శ్రీధర్, శేరి అంతిరెడ్డి, విద్యాసాగర్, సభ్యులు దండమూరి ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here