శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ సర్కిల్ పరిధిలో ఉన్న వివిధ డివిజన్ల పార్కుల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ రమేష్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీల్లోని పార్కులను సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పార్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వాకింగ్‌కు వచ్చే వారు, వృద్ధులు, చిన్నారులు, కాలనీ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

పార్కుల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన ఆయన, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి వనరుల క్షీణత నేపథ్యంలో పచ్చదనం అత్యవసరమని అన్నారు. మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్తును రక్షిద్దాం, ఒక్క మొక్క ఎన్నో ప్రాణాలకు ఆధారం, ప్రకృతి మన సంపద – పరిరక్షణ మన బాధ్యత అనే సందేశాలను ప్రజలకు అందించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్కులో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రకృతిని పరిరక్షించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించగలమని అన్నారు. ఈ సమావేశంలో UBD అధికారులు ప్రియాంక, నాగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.





