నమస్తే శేరిలింగంపల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయం లో పాలక మండలి సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి సత్య సాయి సుదర్శనం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి విశ్రాంత ఆచార్యులు పరిమి రామనరసింహం మాట్లాడుతూ తెలుగు వారి తొలి పండుగ ఉగాది అన్నారు. ఈ ఉగాది పర్వదినాన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేయించటం, పంచాంగ శ్రవణం చేయడం అలాగే కవి సమ్మేళనాలు, అవధానాది కార్యక్రమాలు జరుపుకోవడం అనేవి అనాదిగా వస్తున్న మన ప్రాచీన తెలుగు సంప్రదాయమన్నారు. కవిత్వమనేది రెండు రకాలని ఒకటి వచన కవిత్వం, రెండు పద్య కవిత్వమని తెలిపారు. వసంతం నిత్య నూతనానికి ప్రతీక అని, వసంతంలో కలిగే ఉత్తేజం, ప్రకృతి పరమైన ఉల్లాసంతో కవి తన కవితాగానం చేస్తుంటాడన్నారు. సహజ సిద్ధమైన ప్రకృతిని వర్ణిస్తూ సమకాలీన సమాజంలో జరిగే విషయాలపై ఈ మధు మాసంలో రసవత్తరంగా కవితా గానం చేస్తు మనల్ని ఉత్తేజ పరచి ఆనందాన్ని ఇస్తూ మన సంప్రదాయాలను గుర్తుచేస్తుంటాడని చెప్పారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ కవులు, కవయిత్రులు సుమారు 40 మంది తమ కవితాగానంతో శ్రోతలను ఆనందపరిచారు. లబ్ధ ప్రతిష్ఠులైన కవి కోకిలలు అవధాని అంజయ్య, చిత్రకవితాసమ్రాట్ చింతా రామకృష్ణారావు, డాక్టర్ బాబావలి రావు, ఏ.సత్యనారాయణ రెడ్డి, భమిడిపాటి వేంకటేశ్వర రావు, చమత్కార కవి కామేశ్వరరావు, మాచవోలు శ్రీధర్ రావు, సీపీ రెడ్డి, మావిశ్రీ మాణిక్యం, మోటూరి నారాయణరావు, తదితర కవులను దుశ్శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ప్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున రామస్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నెల్లూరు అశోక్ కుమార్, ఫణికుమార్, శ్రీనివాస్, విజయలక్ష్మి, జనార్ధన్, సాహితి పోషకులు, సాహితి అభిమానులు, కోవెల పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.