నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తారానగర్ లోని విద్యానికేతన్ మోడల్ హైస్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రప్రథమంగా మహిళా కార్మిక ఉద్యమం నుంచి మహిళా దినోత్సవం పుట్టుకొచ్చిందన్నారు. 1908 లో తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, మహిళల ఓటుహక్కు కోసం ఉద్యమం ప్రారంభమై క్రమేణా అది మహిళా దినోత్సవంగా రూపాంతరం చెంది తొలిసారిగా 1911 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. దీని ప్రధాన ఉద్దేశం స్త్రీలకై ఏర్పరచిన హక్కులు , సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా స్త్రీ అభ్యున్నతికి సహకారం. విద్య, వైద్యం అందించడం లో వివక్షా రహిత ప్రవర్తన కలిగి సమానంగా భావించటం. ఇంటా బయటా ఎదురు అవుతున్న వేధింపులపై బహిరంగంగా సత్యాన్వేషణ తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆర్యోక్తి అన్న నానుడిని మనం కొంత మార్పులతో నేటి సమాజ స్థితిగతులకు అన్వయించుకునేలా మార్చుకోవాలన్నారు. స్త్రీ పూజింపబడడం అంటే తన పనులను తాను స్వతంత్రంగా నిర్వర్తించటమేనని, స్త్రీలను గౌరవించడమంటే తనకున్న బాధ్యతలను తానుగా ఆలోచించి నెరవేర్చేలా చేయటమే అని అన్నారు. నేటి మహిళ సమాజంలో ఉన్న అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని 50 కాలనీలకు చెందిన మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. సంఘ సేవకులు మూల వేంకటేష్ గౌడ్ సౌజన్యంతో ఆచార్య విజయలక్ష్మి చేతుల మీదుగా గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు శ్రీచందన (వెల్నెస్ కౌచ్ ), గోపి కృష్ణ (రోటరీ క్లబ్ సెక్రెటరీ), ఉమాచంద్రశేఖర్, అజిత, వాణి, రాధారాణి, విజయలక్ష్మి, రజని, రాణి యాదవ్, వరలక్ష్మీ, తన్వీర్ బేగం, చంద్రకళ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.