నమస్తే శేరిలింగంపల్లి: బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి చేసేందుకు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహోన్నతుడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. మహాత్మ గాంధీ 74 వ వర్థంతిని పురస్కరించుకుని మాదాపూర్ స్వాతి హై స్కూల్ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ చేత కర్ర పట్టి, నూలు ఒడికి, మురికి వాడలను శుభ్రం చేసి అన్ని మతాలు, కులాలు ఒకటేనని చాటి చెప్పిన మహనీయులు మహాత్మా గాంధీ అని అన్నారు. సత్యం, అహింసలను సిద్ధాంతాలుగా మలచుకొని సహాయ నిరాకరణ, సత్యాగ్రహాలను ఆయుధాలుగా చేసుకొని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడ గడలాడించి భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మ గాంధీ అని తెలిపారు. బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి, ప్రపంచ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొంది మహోన్నత వ్యక్తిగా అవతరించారన్నారు. మహాత్మా గాంధీ గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అని నినదించారని, పెద్ద పరిశ్రమల కన్నా, చిన్న పరిశ్రమల తోటే ఆర్ధిక అసమానతలు లేకుండా అభివృద్ధి సాధ్యం అని భావించిన వ్యక్తి గాంధీ అన్నారు. రైతులు, మహిళల హక్కులకై, అంటరానితనాన్ని నిర్మూలన లాంటివాటితో పాటు స్వాతంత్ర్య సముపార్జనలాంటి సమస్యలపై పది ఉద్యమాలు చేశారన్నారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫణి కుమార్, సభ్యులు విష్ణు ప్రసాద్, పాలం శ్రీను, ప్రవీణ్, బాలాజీ, హేమలత, రవి, భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.