నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతిభ్రమించి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడని బిజెపి నేత, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మండిపడ్డారు. ఆదివారం గోపనపల్లిలోని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ నివాసంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. హఫీజ్ పేటలోని శ్రీకృష్ణ నగర్ కు చెందిన టిఆర్ఎస్ నాయకుడు రమేష్ రెడ్డి, ఆయన అనుచరులు రవి కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ బిజెపిని ఉరికించాలని కెసిఆర్ మాట్లాడటాన్ని చూస్తే ఆయనకు మతిభ్రమించింది అనడానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీజేపీని ఎందుకు ఉరికిస్తాడని, కెసిఆర్ అవినీతి, అక్రమాలు, భూ భాగోతాలు ప్రజలకు చెప్పినందుకా అని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి బీజేపీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో నిజాయితీ పరిపాలన, అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ దోపిడీ సామ్రాజ్యాన్ని బిజెపి బట్టబయలు చేస్తుందని హెచ్చరించారు. పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుని ఈ దొరలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేద్దామని రవికుమార్ ఆర్ పిలుపునిచ్చారు. గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ దొరల పాలనను అంతమొందించడం బిజెపి వల్లనే సాధ్యమైతుందని అన్నారు. టిఆర్ఎస్ నుండి బిజెపిలో చేరిన నాయకులు కార్యకర్తలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్ , కర్చర్ల ఎల్లేశ్, ఆకుల నరసింహ, శేరిలింగంపల్లి బిజెపి నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.