సైబరాబాద్‌లో అభివృద్ధి పనులలో వేగం పెంచాలి : CMC కమిషనర్

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో పౌర అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని CMC కమిషనర్ సృజ‌న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగాలపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా విభాగాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, పౌర సేవల అందింపు, పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార స్థితిని కమిషనర్ సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

నగరంలో రహదారి కూడళ్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తరచూ నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అభివృద్ధి పనిని నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, క్షేత్రస్థాయి అధికారులు పనుల అమలుపై వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని, నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించే మార్పులు తీసుకురావాలని CMC కమిషనర్ ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here