చెట్టును ఢీకొని రెండు ముక్కలైన కారు – ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి – మద్యంమత్తు, అతివేగంతోనే అనర్ధం

నమస్తే శేరిలింగంపల్లి: మద్యం మత్తు ఆపై అతివేగంతో కారు నడుపుతూ చెట్టును ఢీ కొట్టడంతో సాక్షాత్తు ఆ అమ్మవారి సాక్షిగా అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా అదే కారులో ఉన్న మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. శనివారం తెల్లవారుజామున హెచ్సీయూ ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, చికిత్స పొందుతున్న బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం. విజయవాడకు చెందిన అబ్దుల్ రహీమ్ (24) మాదాపూర్ యాక్సిస్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన ఎన్. మానస (23), మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లికి చెందిన ఎం. మానస(21) జూనియర్ ఆర్టిస్టులు. గచ్చిబౌలికి చెందిన సిద్దూ ఈ నలుగురు స్నేహితులు. శుక్రవారం రాత్రి వీరంతా కలిసి గచ్చిబౌలిలోని సిద్దూ ఇంట్లో పార్టీ చేసుకున్నారు.

మృతులు ఎన్. మానస, ఎం. మానస (ఫైల్ ఫోటో)

అమ్మాయిలు ఇద్దరు బీర్లు, అబ్దుల్ రహీం బ్లాక్ డాగ్ మందు సేవించారు. తాగిన మైకంలో అమ్మాయిలు ఇద్దరూ, రహీమ్ కలిసి ముంబై హైవేలో టీ తాగుదమని బలవంతం చేయడంతో మద్యం సేవించి ఉన్నారని, వద్దని సిద్దూ వారించినా వినలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నలుగురూ కలిసి ఐ ట్వంటీ (టీఎస్ 07యూహెచ్1349) సెల్ఫ్ డ్రైవింగ్ కారులో గచ్చిబౌలి నుండి బాలయోగి స్టేడియం, హెచ్ సీయూ మీదుగా లింగంపల్లికి వెళుతున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఎల్లమ్మతల్లి దేవాలయం ఎదురుగా ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు రెండు భాగాలుగా విడిపోయింది.

రెండు భాగాలుగా విడిపోయిన కారు

అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఎం. మానస, ఎస్. మానస, అబ్దుల్ రహీం అక్కడిక్కడే మృతిచెందగా సిద్ధూ తీవ్రగాయాలకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన సిద్దూను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలిలో చెల్లా చెదురుగా ఉన్న కారు విడిభాగాలను తొలగించారు. మృతి చెందిన ఇద్దరు అమ్మాయిలు అమీర్‌పేట్‌లోని హాస్టల్ లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారుపై ఓవర్ స్పీడ్ కు సంబంధించి ఇప్పటి వరకు రూ. 14వేల చలాన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం నుంచి బయటపడిన సిద్దూ…

గచ్చిబౌలిలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, గాయపడ్డ సాయి సిద్దు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పలు విషయాలను‌ సిద్దూ వెల్లడించారు. శుక్రవారం రాత్రి తమ రూములో సిట్టింగ్ వేశామని, ఎం. మానస (23) ఎస్. మానస (21), రహీమ్(24) లు మద్యం సేవించారని, తాను తాగలేదని, మద్యం సేవించిన తరువాత టీ తాగేందుకు వెళ్దామని అమ్మాయిలు, రహీమ్ ఒత్తిడి చేశారన్నారు.

అప్పటికే తాను వద్దని వారించిన వినలేదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది అయిన ఈ సమయంలో బయటికి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించినా తన మాట వినకపోవడంతో సరే అని నేను, ఆ ముగ్గురు కలిసి బయలుదేరామన్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి హెచ్ సీయూ డిపో వద్దకు చేరుకోగానే ఓవర్ స్పీడ్ లో కారు నడుపుతున్న రహీమ్ ఎల్లమ్మతల్లి ఆలయం ఎదురుగా ఉన్న చెట్టును ఢీ కొట్టడంతోనే కారు రెండు ముక్కలైందన్నారు. మద్యం మత్తులో అతివేగంతో డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ముగ్గురు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారని సిద్దు తెలిపాడు. ప్రమాదం జరిగిన కాసేపటికే అక్కడి చేరుకున్న పోలీసులు తనకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చెయ్యగా జీరో వచ్చిందన్నారు.

ప్రమాదానికి గురైన నలుగురికి ఎలా పరిచయం ఉందన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. అర్ధరాత్రి లింగంపల్లి ఎందుకు వెళ్తున్నారన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here