నమస్తే శేరిలింగంపల్లి: సంపూర్ణ అక్షరాస్యతతో దేశాభివృద్ధి సాధ్యమని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంను పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్ల సాయినగర్ లోని శిశుమంగల్ అనాధ ఆశ్రమం , బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ లో గల ఎస్ ఓ ఎస్ అనాథశరణాలయంలో విద్యార్థిని, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా తాడిబోయిన రామస్వామి యాదవ్ యునెస్కో వారు 1966 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత దినోత్సవం నిర్వహించాలని సూచించటం వలన ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత దినోత్సవంను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. పిల్లలు, పెద్దలలో అక్షరాస్యతను పెంచడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కాలానుగుణంగా అక్షరాస్యత వలన చదవటం, వ్రాయటం, వినటం విషయాలను అవగాహన చేసుకొని నైపుణ్యం కలిగి ఉండటం వ్యవహారిక అక్షరాస్యతగా యునెస్కో వారు నిర్వచించారని అన్నారు. మానవుడు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే అని అన్నారు. భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని అన్నారు. నేటి యువతీయువకులు నిరాక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్ , జనార్దన్ , బాలన్న తదితరులు పాల్గొన్నారు.