శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేలా పార్కులను సుందరీకరించే దిశగా చర్యలు చేపడతామని చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విలువైన పార్కు స్తలాల రక్షణతో పాటు విభిన్నమైన థీమ్ పార్కు తరహాలో అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని అపర్ణ కమ్యూనిటీలో జీహెచ్‌ఎంసీకి చెందిన ఎకరానికి పైగా పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలని అపర్ణ కమ్యూనిటీ ఫెడరేషన్ అధ్యక్షురాలు రాణిరెడ్డి నేతృత్వంలో సభ్యులు రెండు రోజుల క్రితం డీసీని కలిసి విన్నవించారు. ఈ మేరకు వారి విన్నపంతో బయోడైవర్సిటీ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ , సానిటేషన్ విభాగాలతో కలిసి డీసీ మోహన్‌రెడ్డి సదరు పార్కును సందర్శించారు. పార్కులో ఏపుగా పెరిగిన చెట్లతో పాటు బండరాళ్లు, ఇతర కంపచెట్లను పరిశీలించటంతోపాటు ఒక వైపు పార్కు గోడను తొలగించి బారీకేడింగ్ వేయటాన్ని డీసీ పరిశీలించారు.
ఈ సందర్భంగా డీసీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ విలువైన పార్కు స్తలం ఆక్రమణకు గురి కాకుండా ప్రహరీ పునర్నిర్మాణం చేయాలని, పార్కు లోపల చెత్త, అవసరపు చెట్ల తొలగింపు సహా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఫెడరేషన్ భాగస్వామ్యంతో పార్కును మరింత సుందరీకరించి థీమ్ పార్కు తరహాలో అభివృద్ధికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను తయారు చేసి పంపాలని సూచించారు. అపర్ణ పరిసరాలలో నివసించే వందలాది కుటుంబాలకు ఈ పార్కు ఎంతగానో దోహదపడే అవకాశం ఉన్నదని ఫెడరేషన్ అధ్యక్షురాలు రాణిరెడ్డి డీసీకి విన్నవించారు. పార్కు అభివృద్ధిలో తమ తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కేవీఎస్ఎన్‌రాజు , డీఈ దుర్గాప్రసాద్, డాక్టర్ రవి, టీపీఎస్ రాకేష్, యుబీడీ అధికారి సమీర, ఫెడరేషన్ ప్రతినిధులు విక్రమ్, రమేష్, డాక్టర్ రాజారామ్, డాక్టర్ నారాయణరెడ్డి, పద్మ, రాగిణి తదితరులు పాల్గొన్నారు.