కుంగిన భూమి.. ఆందోళనలో జనం

  • గౌతమ్ నగర్ కాలనీ లో ప్రణీత్ హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థ భారీ నిర్మాణం
  • జాగ్రత్త చర్యలు చేపట్టకుండా పనులు
  • గురువారం ఒక్కసారిగా కుంగిన భూమి
  • ప్రజలతో కలిసి శాంతియుతంగా బిజెపి ఆందోళన.. దాడులు చేసిన పోలీసులు
  • ఖండించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొవ్వ సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: బడా బాబులు చేపట్టే అక్రమ నిర్మాణాలు అధికారులకు కనిపించవా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా ఈరోజు జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ లోని గౌతమ్ నగర్ కాలనీ లో ప్రణీత్ హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మాణ పనులు చేస్తుండగా ఒకసారిగా భూమి కుంగిపోయింది. కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యలు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ వెంటనే స్పందించి ఆ ప్రదేశానికి చేరుకొని స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… సరైన అనుమతులు లేకుండా ప్రణీత్ హోమ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణం చేపట్టడంతోపాటు దీనికి సంబంధించి సెల్లార్ కోసం తొవ్వడంతో పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయిందని, దీనితో కాలనీ వాసులు బయటికి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఆందోళన చేపట్టామన్నారు.

కనీసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణ సంస్థ నిర్మాణం చేపట్టిందని, అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్ కి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులకు స్థానిక కార్పొరేటర్ కి సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే కూలగొట్టే జిహెచ్ఎంసి అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బిల్డింగ్ పర్మిషన్.. బ్లాస్టింగ్ పర్మిషన్ ఏవి అని అడగడంతో ప్రణీత్ కన్స్ట్రక్షన్ సైట్ సివిల్ ఇంజనీర్ తెల్ల ముఖం వేయడం జరిగింది. దీని వెనక బడా రాజకీయ నాయకుల హస్తం ఉందని బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక రాజరిక పాలనను సాగిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్బంలో రంగప్రవేశం చేసిన చేసిన పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న స్థానిక కాలనీ వాసులను, వారికి మద్దతు తెలిపిన బీజేపీ నాయకుల పై అన్యాయంగా, విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సందర్బంలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసు దుశ్చర్యలను మొవ్వా సత్యనారాయణ తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ బడా రాజకీయ నాయకులకు, బిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారరాని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here