- జవహర్ నవోదయ విద్యాలయంలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
- మౌలానా ఆజాద్ కు నివాళి అర్పించిన ఆచార్య అఫరజ్
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్నపల్లి లో ని జవహర్ నవోదయ విద్యాలయంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.డి.ఆర్. కుమార్ అధ్యక్షతన అవగాహన కార్యక్రం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య అఫరజ్ హాజరై రాజనీతి శాస్త్ర డిపార్ట్ మెంట్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి ( మను ) విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మౌలానా ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడుగా, సాహితీవేత్తగా, పత్రికా సంపాదకుడుగా విశేష సేవలందించారని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం మొదటి భారత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా 11 ఏండ్ల పాటు పనిచేసి, విద్యాసంస్కరణలకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళలు, సంగీతం, సాహిత్యం పునరుద్ధరించడానికి అనన్యసామాన్యమైన కృషి చేశారు. 1948లో ప్రాథమిక ఉన్నత విద్యకు, సెకండరీ విద్యకు, ప్రత్యేక కమిషనర్లను నియమించారు. మానవుడు సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే విద్యద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. సమాజంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని పరిణితి చెందాలని, క్రమశిక్షణతో మంచి అలవాట్లు అలవర్చుకుని చదువు మీదే ధ్యాస పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ M S మిత్రి, అధ్యాపకులు ధీరజ్ , దుర్గాప్రసాద్ , తిలక్ , మంజురాణీ , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వర రాజు పాల్గొన్నారు.