రెండు నెలలు ముందుగానే ఎన్నికలు…?
నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల సమరం మొదలవ్వబోతుందా..? నగర పాలక మండలి గడువు పూర్తవ్వడానికి రెండు నెలల ముందుగానే కార్పొరేటర్ అభ్యర్థులు తిరిగి ఎన్నికల బరిలో దిగనున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే అవుననే సమాధానం వినబడుతుంది.
గత జిహెచ్ఎంసి సాధారణ ఎన్నికలు 2016 ఫిబ్రవరి 2వ తేదీన గ్రేటర్ ఎన్నికలు జరుగగా ఫిబ్రవరి 15 వ తేదీన ఫలితాలు వెలువడాయి. ఈ ప్రకారంగా కార్పొరేటర్ల పదవీకాలం 2021 ఫిబ్రవరి తో ముగియనుంది. కాగా జనవరి చివరి వారంలో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావించాయి. అయితే మంగళవారం మినిష్టర్ క్వార్టర్స్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ఎవ్వరూ ఊహించని ప్రకటన చేశారు. నవంబరు రెండవ వారం తరువాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు అందరూ సిద్ధంగా ఉండాలని తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు దుబ్బాక ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గ్రేటర్ ఎన్నికలు ముందస్తుగానే నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గడువుకు నాలుగు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు పాలకమండలికి ఉంది. అధికార పార్టీ నిర్వహించిన సర్వేల్లో తిరిగి విజయం సాధించేందుకు అనుకూల పరిస్థితులు ఉండటం వల్లే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ కార్పొరేటర్ల క్షేత్రస్థాయి పర్యటనలు, పాదయాత్రలు, బస్తీబాట కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్షాల నాయకులు సైతం అధికార పార్టీ కార్యక్రమాలకు ధీటుగా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గ్రేటర్ లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగా లేదని కేటీఆర్ కార్పొరేటర్లను హెచ్చరించారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, డివిజన్లలో ప్రతి వీధి తిరిగి సమస్యలను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ కార్పొరేటర్ లకు సూచించారు.