టీకాల ప‌ట్ల అవ‌గాహ‌న అవ‌స‌రం

  • దేశంలో టీకాల‌ను పొంద‌లేక‌పోతున్న 35 శాతం మంది చిన్నారులు
  • వ్యాధుల నుంచి ర‌క్షించేందుకు టీకాలు త‌ప్ప‌నిస‌రి

కృత్రిమ రోగ నిరోధకత అనేది ఒక అంటు వ్యాధి నుండి వ్యక్తిని రక్షించడానికి టీకాలు అందించడం ద్వారా అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని మనిషిలో పెంచడానికి దోహదపడే ఒక విధానం. ప్రాణాంతకమైన వ్యాధుల భారి నుండి చిన్నారులను రక్షించడానికి ఈ కృత్రిమ రోగ నిరోధక కార్యక్రమం దోహదపడుతుంది. తద్వారా వ్యాధులను ఒకరి నుండి మరొకరికి సోకకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీకాలు వ్యక్తిలో ఉన్న సహజ సిద్దమైన రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి తద్వారా అతనికి సదరు వ్యాధి సోకకుండా రక్షణ కల్పిస్తుంది.

సాధారణంగా చిన్నారులు పుట్టినపుడే తల్లి నుండి పాలు స్వీకరించడం ద్వారా వచ్చే సహజసిద్దమైన రోగ నిరోధక వ్యవస్థతో పుడుతారు. అయితే ఇలా తల్లిపాల ద్వారా వచ్చే రోగ నిరోధక శక్తి ప్రభావం నెమ్మదిగా తగ్గి చిన్నారి తన సొంత రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ది చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ ప్రక్రియలో చిన్నారికి పెద్దగా ఖర్చు లేకుండా, జీవన పద్దతులలో పెద్దగా మార్పు చేయాల్సిన అవసరం లేకుండా రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించడంలో టీకాల ద్వారా అందించే కృత్రిమ రోగ నిరోధక వ్యవస్థ సహాయపడుతుంది.

భారత దేశంలో చిన్నారులకు టీకాలు ఇవ్వడం తప్పనిసరా ?
మనం అత్యాధునిక వైద్య విధానం అభివృద్ది చెందిన ప్రపంచంలో బ్రతుకుతున్నా, ఇంకా మన చుట్టూ ఎన్నో భయంకర వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి. ఈ వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి వైద్యులు మనకు టీకాలు చేయించుకోవాలని సూచిస్తూ తద్వారా సదరు వ్యాధి నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచిస్తుంటారు.

అందుకే భారత దేశంలో ప్రత్యేకమైన టీకాలు ఇచ్చే కార్యక్రమం ద్వారా ప్రజలకు పలు వ్యాధుల నుండి సంరక్షణ క‌ల్పించి ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి సహాయపడుతున్నారు. ఇలా మనకు టీకాలు ఇచ్చినపుడు మన శరీరంలో ఒక ప్రత్యేకమైన రీతిలో వైరస్ లేదా బాక్టీరియాను ప్రవేశపెట్టబడి తద్వారా ఆయా వ్యాధులకు సంబంధించిన వైరస్ లేదా బాక్టీరియా కు వ్యతిరేకంగా శరీర రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ది చేయడం జరుగుతుంది. తద్వారా తత్సంబంధిత వ్యాధికి చెందిన బాక్టీరియా లేదా వైరస్ లు మన శరీరంలోనికి ప్రవేశించన సందర్భాలలో అప్పటికే ఈ వైరస్ లేదా బాక్టీరియా పై అవగాహన ఏర్పరచుకొన్న మన వ్యాధి నిరోధక శక్తి సదరు వైరస్ లేదా బాక్టీరియాపై పోరాడి శరీరాన్ని కాపాడుకోగలుగుతుంది.

అందుకే మన దేశంలో చిన్నారి పుట్టిన నాటి నుండి పలు రకాలైన టీకాల‌ను వైద్యులు సూచించి వేయమని సలహా ఇస్తారు. తద్వారా పలు తీవ్రమైన వ్యాధుల నుండి ఆ చిన్నారులను కాపాడుకోవడానికి అవసరమైన రోగ నిరోధక వ్యవస్థ అందిస్తారు. ఇది సమాజ అభివృద్దికి ఎంతో కీలకమైన ప్రక్రియ కావున భారత ప్రభుత్వం టీకా కార్యక్రమ ఆవశ్యకతను గుర్తించి పలు ప్రభుత్వాసుపత్రులలో వీటిని పూర్తిగా ఉచితంగా గానీ లేదా తక్కువ ధరలలో అందుబాటులో ఉండేలా చూస్తోంది.

ఈ ప్రక్రియలో భారతదేశంలో కింద పేర్కొనబడిన ఆరోగ్య సమస్యలు లేదా వ్యాధులకు టీకాలు అందించే లక్ష్యం కొనసాగుతోంది. వాటిలో ప్రధానంగా..
• తట్టు
• ధనుర్వాతం
• క్షయ
• టైఫాయిడ్
• గవదబిళ్లలు
• డిఫ్తీరియా లేదా కంఠ వాతము
• పెర్టుసిస్ లేదా కోరింత దగ్గు
• పోలియో
• హెపటైటిస్ బి
• హెపటైటిస్ ఎ
• రుబెల్లా
• రోటా వైరస్ కారణంగా వచ్చే గ్యాస్ట్రో ఎంటెరిటిస్

పైన పేర్కొన్న వ్యాధులను నివారించడానికి భారత దేశంలో చిన్నారులకు కింద పేర్కొన్న టీకాలను సూచిస్తున్నారు.

• బాసిల్లస్ కాల్మెట్ గురిన్ లేదా బిసిజి టీకా
• నోటి ద్వారా అందించే పోలియో వ్యాక్సిన్‌
• డిపిటి వ్యాక్సిన్
• ఎంఎంఆర్ (తట్టు గవద బిల్లలు రుబెల్లా) వ్యాక్సిన్
• హెపటైటిస్ బి వ్యాక్సిన్

అంతే గాకుండా పలు ఇతర రకాలైన వ్యాక్సిన్ లను కూడా వైద్యులు సందర్భాన్ని అనుసరించి సూచిస్తారు. ఇలా ఎంతో ప్రభావవంతమై టీకా కార్యక్రమాన్ని రూపొందించడం ద్వారా దేశంలో ఉన్న చిన్నారులకు సరైన రోగ నిరోధకత కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించడానికి వీలవుతుంది.

భారతదేశంలో ఈ రోగ నిరోధక కార్యక్రమ స్థితిగతులు…
ఇలా ప్రపంచంలో రోగ నిరోధక వ్యవస్థ ఏర్పరిచే కార్యక్రమాలన్నింటిలో భారత దేశం నిర్వహిస్తున్న కార్యక్రమం అతి పెద్దదనే చెప్పవచ్చు. ఎంతో కష్టపడి గతంలో అసలు టీకా కార్యక్రమాలలో భాగస్వాములు కానీ ఎందరో చిన్నారులకు టీకాలు అందించడం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురువుతూనే ఉండడం గమనార్హం. వీటిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 12 – 23 నెలల మధ్య ఉన్న చిన్నారులలో వ్యాక్సినేషన్ కేవలం 62 శాతం మందికి మాత్రమే అందుతోందనేది గణాంకాలు పేర్కొంటున్న విషయం. అంటే 35 శాతానికి పైగా చిన్నారులకు సంపూర్ణంగా టీకాలు అందడం లేదనేది స్పష్టం.

ఇలా 35 శాతం మంది 12-23 నెలల మధ్య ఉన్న చిన్నారులకు టీకాలు అందకపోవడానికి ఎన్నో కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. వాటిని విశ్లేషిస్తే..

• సరైన అవగాహన లేదా సమాచార లోపం కారణంగా – 35 శాతం
• టీకాల కారణంగా వచ్చే ఇతర ఇబ్బందులకు భయపడి – 26 శాతం
• సరైన టీకా అందించే వ్యవస్థ లేని కారణంగా – 12 శాతం
• టీకాలు ఇవ్వాల్సిన సమయంలో చిన్నారులు ప్రయాణిస్తుండడం లేదా వలస పోవడం – 13 శాతం
• పలు అపోహలతో టీకాలు తీసుకోకపోవడం- 8 శాతం
• ఇతరత్రా కారణాలు – 6 శాతం

సరైన సమయంలో వ్యాక్సిన్ అందేలా చూడడం ఎంతో కీలకం
మంచి జీవితానికి మంచి ఆరోగ్యం ఎంత కీలకమో, మంచి జీవన విధానానికి మంచి సంపూర్ణ పోషకాహారం కూడా అంతే అవసరం. ఇలా ఒక వ్యక్తి మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడంటే అతని గుండె పనితీరు, కండరాలు, ఎముకలు, సామాజిక జీవితం కూడా బలంగా ఉన్నట్లే. అయితే భారత దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారే. ఇదే సందర్భంలో ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ప్రధానమైన అంశం సరైన సమయంలో అవసరమైన రోగ నిరోధక వ్యవస్థ చిన్నారులకే కాకుండా కాబోయే తల్లులకు అందించడం ఎంతో అవసరం. ఈ అంశాన్ని సరైన అవగాహన లేని కారణంగా చాలా మంది గుర్తించకుండా అవసరమైనంత మేర టీకాలను సరైన సమయంలో సరిగ్గా అందించడంలో విఫలమవుతుంటారు. ఇదే భవిష్యత్తులో మనం రోగాలు పాలు కావడానికి కారణమవుతుందని గుర్తించరు.

టీకాల కారణంగా ఏర్పడే కొన్ని ఇతర ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించడం
మనం తీసుకొనే ఎన్నో మందుల లాగా టీకాలు కూడా కొన్ని ఇతర ఇబ్బందులకు దారి తీయవచ్చు. ముఖ్యంగా టీకాలు వేసినపుడు అది ఇచ్చిన ప్రదేశంలో నొప్పి రావడం లేదా జ్వరం రావడం సంభవించడం తరచూ గమనించవచ్చు. ఇలాంటి వాటిపై ఉన్న పలు అపోహల‌ కారణంగా.. అంటే టీకాల కారణంగా వచ్చే ఇతర ఇబ్బందులకు భయపడడం వలన పలువురు చిన్నారులకు సరైన సమయంలో టీకాలు అందడం లేదనేది స్పష్టమైన విషయం. ముఖ్యంగా పెంటావాలెంట్ లేదా డిపిటి టీకా ఇచ్చే సందర్భాలలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నట్లు అర్థమవుతోంది.

అందుకే టీకాలపై అవగాహన కల్పించడం ఎంతో కీలకం
చివరగా చిన్నారులకు టీకాలు ఎందుకు అందడం లేదని పరిశీలిస్తే పైన పేర్కొన్న ఇబ్బందులన్నింటికీ అవగాహన లేమే కారణ‌మని తేలుతుంది. ఈ అవగాహన లేమి లేదా సమాచార లోపం కారణంగానే మన దేశంలో 35 శాతం మంది చిన్నారులకు సంపూర్ణంగా అవసరమైన టీకాలన్నీ అందడం లేదనే చెప్పవచ్చు. ఇదే కారణంగా 8 శాతం మంది అసలు టీకాలు వేసుకోవడం లేదన్న విషయాన్ని గమనిస్తే మొత్తానికి దగ్గర దగ్గరగా సగానికి పైగా చిన్నారులు సంపూర్ణ టీకా కార్యక్రమం ద్వారా లబ్ది పొందడం లేదని తేలుతుంది.

అందుకే భారత దేశం చేపట్టిన సంపూర్ణ టీకా కార్యక్రమం విజయవంతం కావాలంటే సరైన అవగాహన కల్పించడమే సరైన పరిష్కారం. ముఖ్యంగా కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలలో టీకాలపై సరైన అవగాహన కల్పించడం ద్వారా మనం ఆరోగ్య భారతాన్ని సాధించగలుగుతాం.

డాక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్ న‌వాజ్
ఎంబీబీఎస్‌, ఎండీ, క‌న్స‌ల్టెంట్ పిడియాట్రిషియ‌న్ అండ్ నియోనాటాల‌జిస్ట్‌
ఆస్ట‌ర్ ప్రైమ్ హాస్పిట‌ల్స్, అమీర్‌పేట‌, హైద‌రాబాద్‌.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here