నమస్తే శేరిలింగంపల్లి : ఫ్లెక్సీల కాల్చివేత ఘటనలో తప్పుడు సమాచారం ఇచ్చి పొలీసులను తప్పుదోవ పట్టించినందుకు బీజేపీ నాయకురాలిపై కేసు నమోదైంది. ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ పాలవెల్లి వెల్లడించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా పాపిరెడ్డి కాలనీ ఆరంభ టౌన్షిప్ వద్ద బీజేపీ నాయకుడు గజ్జెల యోగానంద్ కు ఆహ్వానం పలుకుతూ బీజేపీ నాయకురాలు కాంచనక్రిష్ణ ఆధ్వర్యంలో నాలుగు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే బీజేపీ కార్యకర్త రాజు బుధవారం 20వ తేదీ రాత్రి ఫ్లెక్సీలలో తన ఫొటో రాలేదని గుర్తించి రెండు ఫ్లెక్సీలను కాల్చేశాడు. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఫ్లెక్సీలు కాల్చిన వారిపై ఆరా తీశారు. సీసీ పుటేజీ ని పరిశీలించి బీజేపీ కార్యకర్త రాజు చేసినట్లు గుర్తించారు. కాగా కాంచనక్రిష్ణ అనే బీజీపీ నాయకురాలిని ఈ విషయమై అడగగా.. వేరే పార్టీల వారు ఫ్లెక్సీలు తగుల బెట్టారని తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు చందానగర్ పోలీసులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.