నమస్తే శేరిలింగంపల్లి: గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి విక్రయాన్ని చందానగర్ పోలీసులు బయలు చేశారు… ఎస్ఐ రఘు తెలిపిన కథనం ప్రకారం.. ఆదర్శనగర్ బస్టాప్ లో నార్కోటిక్ డ్రగ్స్, డ్రై గంజాయి రవాణా చేస్తున్నట్లు ఓ వ్యక్తి మియాపూర్ ఏసీపీకి సమాచారం అందించాడు. ఈ విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి బస్టాప్ వద్దకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం గం.6:45 నిమిషాల ప్రాంతంలో అక్కడ ఎండు గంజాయి విక్రయిస్తున్న నిషాత్ మొహమ్మద్(30), శుభం సంతోష్ మానే(21), పాతికనేటి వెంకటేష్(25), అబ్దుల్ ఫిరోజ్(26), మహమ్మద్ సైఫ్(26) అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్రికన్ వ్యక్తి సమ్మీ @ పాబిలో, ముంబై(పరారీ) నుండి వచ్చి హైదరాబాద్‌లో ప్యాకెట్‌కు రూ. 2 వేల చొప్పున కొనుగోలు చేశామని, అవసరమైన వినియోగదారుల కోసం ప్యాకెట్‌కు రూ. 4 వేల చొప్పున విక్రయిస్తామని విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక వారి నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ మందు పాకెట్స్, 800 గ్రాముల ఎండు గంజాయి మొత్తం 9 పాకెట్స్, ఆరు మొబైల్స్, మూడు పెన్సిల్ ఇంజెక్షన్స్, ఒక మినీ వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్ననట్టు తెలిపారు.