నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన బతుకమ్మ ఉత్సవాలు శేరిలింగంపల్లిలో అంబరాన్నంటాయి. మహిళలు, యువతులు, చిన్నారులు పట్టు వస్త్రాలు, నూతన వస్త్రాలతో సాంప్రదాయబద్దంగా తయారై తెలంగాణ ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలు, బంతి పూలతో సద్దుల బతుకమ్మను తయారు చేసి ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. డీజే సాంగ్స్, సౌండ్ సిస్టమ్స్ ప్రైవేటు ఆల్బమ్ బతుకమ్మ పాటలతో వీధులన్నీ హోరెత్తాయి.
నల్లగండ్ల అపర్ణ గ్రాండేలో బతుకమ్మ ఉత్సవాలను మహిళలందరూ ఉత్సాహంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అపర్ణా గృహ సముదాయంలో మహిళలు క్లబ్ హౌస్ నుండి బతుకమ్మను పెద్ద ఊరేగింపుతో నిర్వహణా స్థలానికి తెచ్చారు. అందరూ ఉత్సాహంగా పూజలు, కోలాటం, నృత్యాలతో ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శైలజ, శ్రీలత, ఉత్తమ బెహరా, రాధిక, స్వప్న, శ్రీలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ మున్సిపల్ పార్కు వద్ద, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్, తదితర ప్రాంతాలలో మహిళలు సద్దుల బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం ఆయా బతుకమ్మ ఘాట్ లలో బతుకమ్మను నిమజ్జనం చేశారు.