నమస్తే శేరిలింగంపల్లి: దేవీ శరన్నవరాత్రోత్సవాలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. రెండో రోజున పలు ఆలయాల్లో, దేవీ మండపాలలో మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు నిర్వహించారు. దీప్తిశ్రీ నగర్ లోని శ్రీ ధర్మపురి క్షేత్రం లో అమ్మవారు రెండవ రోజు శ్రీ గాయత్రీ మాత గా దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలతో, అర్చన లతో విశేష పూజలు జరిగాయి. మహిళలంతా కలిసి అమ్మవారికి శ్రీ చక్ర పూజలు, కుంకుమార్చనలు చేశారు. అనంతరం పురోహితులు భక్తులు కలిసి హోమం చేశారు. గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, జ్ఞాపకశక్తి, ఆరోగ్యము, ఏకాగ్రత, సంకల్పబలం, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి గాయత్రి మంత్రం ఎంతో ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెప్పారని ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి వివరించారు. చందానగర్ లోని శిల్పాఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రులలో రెండవరోజు అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. సునీల్ కుమార్, అనురాధ దంపతులు, లోకా వెంకటేశ్వర్లు, సుకన్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాకేష్, జ్యోతి దంపతులు ప్రసాద వితరణ చేశారు. గంగారం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భవానిపురం కాలనీలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు చేశారు.