- శిబిరాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సీపి స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్.,
- 5 రోజుల పాటు కొనసాగనున్న వైద్య శిబిరం
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెండో దఫా ‘కంటి వెలుగు’ వైద్య శిబిరాన్ని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని సీటీసీలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ప్రారంభించి కంటి పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పథకాన్ని రూపొందించిందన్నారు. కమీషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం సైబరాబాద్ సీపీ ఆఫీసులోని సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కళ్లద్ధాలు అందించడం, చికిత్స నిర్వర్తిస్తారన్నారు.
ప్రతీరోజు 250 మంది సిబ్బందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కావున సిబ్బంది అందరూ ఈ రెండో దఫా కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ (రంగారెడ్డి జిల్లా) డాక్టర్ రాకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి స్క్రీనింగ్, విజన్ పరీక్షను నిర్వహించడం, కళ్ల జోళ్లను ఉచితంగా సమకూర్చడం, సర్జరీలు, ఇతర చికిత్సలను ఉచితంగా ఏర్పాటు చేయడం, సాధారణ కంటి వ్యాధులకు మందులను సమకూర్చడం, హానికరమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్ధాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసిపి రియాజ్, సిటిసి ప్రిన్సిపాల్ ఏడిసిపి రామచంద్రుడు, ఏడిసిపి శ్రీనివాస రావు, కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ (రంగారెడ్డి జిల్లా) డాక్టర్ రాకేశ్, ఏసీపీ కృష్ణ, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య, రంగారెడ్డి డీఎమ్ హెచ్ఓ డాక్టర్ సృజన, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాకేశ్, కంటి వెలుగు అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ రాము, ఆర్ఐలు వెంకటస్వామి, అరుణ్, సీటీసీ వైద్యులు డాక్టర్ సరిత, డాక్టర్ సుకుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.