నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంలా బతుకమ్మ పండగ నిలుస్తోందని బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ గజ్జల యోగానంద్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ విద్యా నికేతన్ హైస్కూల్ లో బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా మహిళ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జీ గజ్జల యోగానంద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైందన్నారు. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయిందని, బిజెపి శేరిలింగంపల్లి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతీ డివిజన్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
బిజెపి మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు కృష్ణ వేణి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అని పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మ మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు అని అన్నారు. సంప్రదాయబద్దంగా గణపతి, దుర్గమాతలకు పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరీమాతను ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలంతా సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు పేర్చారు. అనంతరం ఆటపాటల మధ్య బతుకమ్మను ఆడి నిమజ్జనం చేశారు. ఈ వేడుకలో బిజెపి మహిళ నాయకురాళ్లు నర్రా జయలక్ష్మి, కాంచన కిష్ణ, మేరీ, వినిత, విజయ లక్ష్మి, బిజెపి నాయకులు నాగేశ్వర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, బీ. అశోక్, మూల అనిల్ గౌడ్, రామ్ రెడ్డి, రాజు శేట్టి, కుమ్మరి జితేందర్, నర్సింహ రావు,చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.