శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ బాలికపై అత్యాచారం చేసినందుకు గాను నిందితుడికి రాజేంద్రనగర్ స్పెషల్ పోక్సో కోర్టు జరిమానాతోపాటు జైలు శిక్ష విధించింది. బాలికకు నష్ట పరిహారం కూడా అందజేయాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడు లంక గ్రామానికి చెందిన పాల రమేష్ (22) బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి బోరబండలోని సాయిబాబా నగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఓ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు జూన్ 9, 2018న పాల రమేష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376(2)(n)తోపాటు పోక్సో చట్టం సెక్షన్లు 5, 6, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 సెక్షన్లు 9, 10 కింద కేసులు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు పాల రమేష్‌ను దోషిగా తేల్చారు. దీంతో రాజేంద్ర నగర్ స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి రమేష్‌కు 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.8వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల నష్ట పరిహారం అందజేయాలని కూడా ఆదేశించింది. దీంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు.