నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యోగం పోయిన బాధలో మద్యానికి బానిసై ఇంటి నుండి బయటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీలోని ప్లాట్1959లో వడ్ల శ్రీనివాసచారి (48) కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. గురువారం ఉదయం తన తమ్ముడు ప్రవీణ్ తో కలిసి పని ఉందని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్లారు. తిరిగి ప్రవీణ్ ఒక్కడే సాయంత్రానికి ఇంటికి వచ్చారు. శ్రీనివాస్ గురించి కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఓల్డ్ ఎంఐజీ రావూస్ స్కూల్ దగ్గర మద్యం తాగి ఉన్నాడని, ఇంటికి రమ్మంటే రావడం లేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు రావూస్ స్కూల్ దగ్గరకు వెళ్లి వెతికినా అతని ఆచూకీ లభించలేదని పేర్కొంటూ శ్రీనివాస్ భార్య మాధవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.