మియాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడి యువకుడు మృతి

శేరిలింగంపల్లి, న‌వంబర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన జె. భరత్ కుమార్ (22) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం (22.11.2026) ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై కేపీహెచ్‌బీ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు కార్యాలయానికి బయలుదేరాడు. ఈ క్రమంలో మియాపూర్‌లోని వైసీ రెడ్డి మెగాహిల్స్ భవనం ఎదుటకు చేరుకోగానే, టీజీ09జెడ్0627 నంబర్ గల ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎం. నారాయణ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడుపుతూ భరత్ కుమార్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో భరత్ కుమార్ రోడ్డుపై పడిపోగా, బస్సు వెనుక వైపు కుడి చక్రం అతని తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి జెనిగే అశన్న (48) ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 1656/2026గా బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మియాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్. జయరామ్ వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here