శేరిలింగంపల్లి, అక్టోబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): వ్యక్తిగత కారణాలతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శ్రీనివాస రావు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి చందానగర్‌లోని హుడా కాలనీలో ఉన్న సాయిబా ఆలయం సమీపంలోని EWS D2లో నివాసం ఉంటూ స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య కండ్రేకుల నాగలక్ష్మి (40) స్థానికంగా ఓ ప్రైవేటు ఉదోగ్యం చేస్తోంది. వీరికి ఐతేజ్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో తన కుమారుడు ఐతేజ్‌ను శ్రీనివాస రావు ఈసీఎల్‌లో ఉన్న తమ బంధువుల ఇంట్లో విడిచిపెట్టి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి శ్రీనివాస రావు విధి నిర్వహణ నిమిత్తం డ్యూటీకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎలాంటి స్పందన రాలేదు. కాసేపటి తరువాత అతను కిటికీ నుంచి చూడగా తన భార్య నాగలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వెంటనే అతను చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాగలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నాగలక్ష్మి వ్యక్తిగత కారణాలతోనే మృతి చెంది ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.





