శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ లింగంపల్లిలో ఉన్న బస్తీ దవాఖానాను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో బస్తీ దవాఖాలు ప్రజల సుస్తీలను నయం చేసేవి అని కానీ ఇప్పుడు దవాఖానాలకే సుస్తీ చేసిందని అన్నారు. ఆరు నెలల నుండి జీతం రావడం లేదని, జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 40 రకాల మందుల సప్లై లేదు అని తెలిపారు. పేషెంట్లు అడిగితే కొన్ని మందులు ఇస్తున్నారు కొన్ని మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నారు అని అంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే తెలివి రేవంత్ రెడ్డికి లేదా అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ మీద కోపంతో పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వైన్ షాపుల టెండర్లకు రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని అన్నారు. జనం తాగాలే ఊగాలే రేవంత్ రెడ్డి కిట్టి నిండాలని విమర్శించారు. ఒకనాడు అయినా ప్రజా ఆరోగ్య వ్యవస్థపై రివ్యూ చేశావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదని, ఉద్యోగులకు వారి కుటుంబాలకు, జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు ఈ ప్రభుత్వం అందించడం లేదని అన్నారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా ఈ హెచ్.ఎస్, జె.హెచ్.ఎస్ కు విడుదల చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బస్తీ దవాఖానాలలో డాక్టర్లకు, సిబ్బందికి వెంటనే వారి జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బస్తీ దవాఖానాలలో 110 రకాల మందులు అందుబాటులో ఉంచాలని, 134 రకాల వైద్య పరీక్షలను బస్తీ దవాఖానాలలో పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని, తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






