శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): రైల్వే స్టేషన్లు, ఏకాంత ప్రదేశాలలో ఉండే ఐదేళ్లలోపు పిల్లలను లక్ష్యంగా చేసుకుని, వారిని కిడ్నాప్ చేసి అమ్మేస్తున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా గత ఐదేళ్లుగా హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కిడ్నాప్ లకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. గత నెల 26న శేరిలింగంపల్లిలోని పోచమ్మ గుడి దగ్గర ఉండే పోచమ్మ అనే మహిళ తన నాలుగేళ్ల కొడుకు అఖిల్ తప్పిపోయాడని చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ముఠాలోని పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చందానగర్ సీఐ విజయ్, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ లతో కలిసి మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్.జి వెల్లడించారు.

సిద్దిపేటకు చెందిన రిజ్వాన స్థానికంగా మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ జీవిస్తోంది. పిల్లలు లేని దంపతులకు పిల్లలను అందజేస్తానని ఒప్పందం చేసుకుని, వారి వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. అనుకున్న విధంగా పిల్లలను సప్లై చేసేందుకు గాను ఆమె సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రాంతానికి చెందిన ఆయుర్వేద మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న చిలుకూరి రాజు, అదే ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి మహమ్మద్ ఆసిఫ్, హైదరాబాద్ మూసాపేట్ కు చెందిన తాపీమేస్త్రీ నర్సింహ్మా రెడ్డి, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన బాలరాజులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకుంది. వీరు రైల్వే స్టేషన్లు, ఏకాంత ప్రదేశాలలో ఐదేళ్ల లోపు పిల్లలను గుర్తించి, కొద్ది రోజుల పాటు గమనించి, తరువాత వారిని అపహరించి, పిల్లలు లేని వారికి అమ్మేస్తారు. ఈ ప్రక్రియలో మహమ్మద్ ఆసిఫ్ ద్వారా రిజ్వానా పిల్లలను విక్రయించేంది. ఆసిఫ్ ద్వారానే డబ్బులు తీసుకునేది. తల్లిదండ్రులకు సరఫరా చేసేవారు. ఇదే క్రమంలో నర్సింహా రెడ్డి గత నెల 26న లింగంపల్లి పోచమ్మ గుడి వద్ద అఖిల్ అనే బాలుడిని అపహరించి చిలుకూరి రాజు ద్వారా రిజ్వానకు బాలుడిని అమ్మాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి నరసింహ్మా రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా ఈ కిడ్నాప్ ముఠా అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా కాచిగూడ, లింగంపల్లి ప్రాంతాలలో చిన్నారులను అపహరించి, మహమ్మద్ ఆసిఫ్, రిజ్వానా సహకారంతో తల్లిదండ్రులు లేని వారికి అమ్మినట్లు బయటపడింది. చందానగర్ పోలీసులు ఈ ముఠా విక్రయాలు జరిపిన ఆరు మంది చిన్నారులను కాపాడారు.

తప్పిపోయిన ఆ ఆరుమంది పిల్లలు వీరే..
ఈ ముఠా అపహరించిన చిన్నారుల్లో 1. అఖిల్ (1 సంవత్సరం ), 2. అరుణ్ (3 సంవత్సరాలు), 3. అమ్ములు (8 నెలలు) (తల్లిదండ్రులు గుర్తించాల్సి ఉంది), 4. లాస్య, (5 సంవత్సరాలు) (తల్లిదండ్రులు గుర్తించాల్సి ఉంది), 5. ఆద్విక్, (2 సంవత్సరాలు )(గుర్తించబడ్డారు) 6. ప్రియ, ( 1 సంవత్సరం ) ఉన్నారు. చందానగర్ పోలీసులు చిన్నారులందరిని రంగారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించి చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీస్ సిబ్బందిని మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రత్యేకంగా అభినందించారు.





