నమస్తే శేరిలింగంపల్లి: దేవుడిపై ప్రజలకు ఉన్న భక్తి విశ్వాసలనే పెట్టుబడిగా మలుచుకుంటున్న దొంగబాబాలు విద్యాధికులను సైతం పూజల పేరుతో బురడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఓ దొంగబాబాను ఆశ్రయించిన మెడికో విద్యార్థి మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువతి కొండాపూర్‌లో నివాసం ఉంటుంది. విదేశంలో మెడిసిన్ పూర్తి చేసిన సదరు యువతి మన దేశంలో మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయేట్ ఎక్జామినేషన్(ఎఫ్ఎంజీఈ)కు సిద్ధమైంది.
గతంలో పలుమార్లు సదరు పరీక్ష రాసినప్పటికి ఫెయిల్ అవుతున్న తరుణంలో ఆమె దృష్టిని ఆకర్శించాడు ఓ బాబా. పశ్చిమబెంగల్‌కు చెందిన విశ్వజీత్ ఝా అనే వ్యక్తి తనను తాను ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకుంటూ, కాళభైరవ పూజ చేస్తే ఎలాంటి పరీక్షలైనా పాస్ అవుతారంటూ 2020లో ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టాడు. దీంతో తరచూ ఎఫ్ఎంజీఈ పరీక్ష తప్పుతూ వస్తున్న సదరు యువతి విశ్వజీత్‌ను ఎఫ్‌బీలో సంప్రదించింది. విడతల వారిగా మొత్తం రూ.80 వేలు చెల్లించింది. ఈ క్రమంలో విశ్వజీత్ కాళభైరవ పూజ చేసినప్పటికి యువతి మల్లీ పరీక్షలో ఫెయిల్ అయ్యింది. దీంతో అతడిని ప్రశ్నించేందుకు యువతి ప్రయత్నించినప్పటికి అవతలి వైపు నుంచి స్పందన లేకపోవడంతో గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకం బృందాన్ని పశ్చిమ బెంగాళ్‌కు పంపినట్టు ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు.