ఆక్రమణదారులను అడ్డుకోండి – అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించండి

  • క‌లెక్ట‌రేట్‌లో డ‌బుల్ బెడ్‌రూంల‌పై జ‌రిగిన సమీక్ష సమావేశంలో‌ ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనుల పురోగతి పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ , కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ తో పాటు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మానస పుత్రిక అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం చాలా గొప్పదని, పేదవాడి ఇంటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గుల్ మొహర్ కాలనీ, సాయి నగర్ ప్రాంతాలలో ఉన్న రెండు పడకల ఇండ్ల పనులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చూడాలని కోరారు.

నిజమైన లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. గతంలో జరిగిన జెఎన్ఎన్ యూ ఆర్ ఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే గృహానిర్మాణాలలో జరిగిన అక్రమాలను అరికట్టాలని, గతంలో ఇండ్ల కోసం డబ్బులు కట్టి ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటయించేలా చూడాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిజమైన లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను అక్రమంగా దళారులు అమ్ముకోవడం, అక్రమ చొరబాటు దారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుందన్నారు. ఈ అక్రమణదారుల వలన నిజమైన లబ్ధిదారులు ఇబ్బందుల పాలై అన్యాయానికి గురవుతున్నారని‌‌ గాంధీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ చొరబాటుదారులను గుర్తించి తక్షణమే నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు కేటయించేలా చూడాలని, రంగారెడ్డి జిల్లానే కాకుండా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి మూడు జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు‌. సానుకూలంగా స్పందించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించి, కేటాయించిన ఇండ్లలో ఎన్ని ఖాళీ ఉన్నాయో గుర్తించి, అక్రమ చొరబాటుదారుల పరిస్థితి, అక్రమంగా నివసిస్తున్న ఇండ్లను గుర్తించి నివేదిక రూపొందించాలని,వచ్చే సోమవారం జరిగే సమావేశానికి పూర్తి స్థాయి నివేదికతో రావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here