ఏసీబీ వ‌ల‌లో చందానగర్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్‌.. రూ.75 వేలు లంచం తీసుకుంటూ దొరికారు..

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై బండెల బాలరాజు, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 696/2026 కేసు దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి ఎస్సై బాలరాజు రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించిన సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు ఈ దాడి చేపట్టారు.

ఎస్సై బాలరాజు కార్యాలయంలోని టేబుల్ డ్రా నుంచి రూ.75 వేల లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే ఎస్సై బాలరాజు రూ.20 వేల నగదును తీసుకున్నట్లు, కానిస్టేబుల్, రైటర్ బి. రాఘవేంద్ర కుమార్ కూడా యూపీఐ ద్వారా రూ.10 వేలు స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని SPE, ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదని ఏసీబీ స్పష్టం చేసింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

భూమికి సంబంధించిన వ్యవహారంలో కేసు నమోదు చేయడంతో పాటు, తదుపరి విచారణ కోసం ఎస్సై, కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేసినట్లు ప్రాథమికంగా సమాచారం. ఈ మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ రాజ్‌కుమార్, స్టేషన్ రైటర్ రాఘవను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here