శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమణల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపడుతున్న వారాంతపు వాక్ ఫ్రీ ఆక్రమణల తొలగింపు డ్రైవ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మూడు జోన్ల పరిధిలో మొత్తం 16.55 కిలోమీటర్ల మేర 243 ఆక్రమణలను తొలగించారు. శేరిలింగంపల్లి జోన్ లో 5.75 కిలోమీటర్ల పరిధిలో 108 ఆక్రమణలు తొలగించారు. నార్సింగిలో 20, పటాన్చెరులో 25, అమీన్పూర్లో 13, మియాపూర్‌లో 15, శేరిలింగంపల్లిలో 35 ఆక్రమణలను తొలగించారు. కూకట్పల్లి జోన్ లోని 3.8 కిలోమీటర్ల పరిధిలో 13 ఆక్రమణలు తొలగించారు. ఇందులో మూసాపేట్లో 13 ఆక్రమణలను తొలగించారు.

కుత్బుల్లాపూర్ జోన్ లో 7 కిలోమీటర్ల మేర 122 ఆక్రమణలు తొలగించారు. చింతల్లో 15, జీడిమెట్లలో 18, కొంపల్లిలో 12, గాజులరామారంలో 20, నిజాంపేట్‌లో 16, దుండిగల్‌లో 18, మేడ్చల్‌లో 23 ఆక్రమణలను తొలగించారు. మిగిలిన సర్కిళ్లలో గుర్తించిన ప్రాంతాల్లో పోలీసు బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను తదుపరి తేదీలకు వాయిదా వేశారు. ఆక్రమణలను తొలగించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరగకుండా సీఎంసీ బృందాలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రజా ప్రదేశాలు ప్రజల వినియోగానికి అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. సైబరాబాద్ వ్యాప్తంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తి చేసి ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా వాక్ ఫ్రీ కార్యక్రమాన్ని సీఎంసీ కొనసాగిస్తోంది.





