శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ 3వ అంతస్తు నుంచి ప్రమాదవ శాత్తూ కిందపడి మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చి రామచంద్రపురం అశోక్ నగర్లో నివాసం ఉంటున్న తెనాలికి చెందిన ఉదయ్(23) ఆదివారం తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. స్నేహితులతో కలిసి హోటల్లోని 3వ అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అక్కడ కుక్క కనిపించింది. దీంతో ఉదయ్ కుక్కను తరిమాడు. ఈ క్రమంలో దాని వెనుకనే పరుగెత్తిన అతను అదుపు తప్పి బాల్కనీ కిటికీ నుంచి కిందకు పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఉదయ్‌ను స్నేహితులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు హోటల్ 3వ అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.. ఆ దిశలో కూడా చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ స్నేహితుల స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.